సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి దంపతులు - త్వరలోనే కాంగ్రెస్ గూటికి - mlc patnam couble into congress
Published : Feb 9, 2024, 11:57 AM IST
MLC Patnam Mahender Reddy Couple Joining in Congress : వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, ఆమె భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన పట్నం దంపతులు, ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సలహాదారుడు వేమనరేందర్ రెడ్డి వారితోపాటు ఉన్నారు.
మహేందర్‌రెడ్డితో పాటు తాను, తమ అనుచరవర్గం వారం రోజుల్లో కాంగ్రెస్‌లో చేరతామని సునీతారెడ్డి గురువారం రాత్రి వెల్లడించారు. దిల్లీ లేదా హైదరాబాద్ వేదికగా పార్టీలో చేరాలా, జిల్లాలో బహిరంగ సభ నిర్వహించి చేరాలా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్‌లో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందే మహేందర్ రెడ్డి, సునీతారెడ్డిలు హస్తం గూటికి చేరతారని ప్రచారం జరిగినా, వారు బీఆర్ఎస్లోనే కొనసాగారు. కాగా ఆ ఎన్నికల్లో తాండూరు బీఆర్ఎస్ టికెట్‌ను మహేందర్‌రెడ్డి ఆశించారు. అయితే అధిష్ఠానం రోహిత్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చింది. ఇదిలా ఉండగా, సునీతారెడ్డి కాంగ్రెస్ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.