ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయం వల్ల రైతులు నష్టపోతున్నారు: ఎమ్మెల్యే పార్థసారథి - ఎమ్మెల్యే పార్థసారథి ఆన్ జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 6:02 PM IST
Irregularities in grain purchase: ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆరోపించారు. ధాన్యం కొనుగోలుపై ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో పాటుగా ఆర్డిఓ, ఎమ్మార్వో, నగర పంచాయతీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఆర్బికే నుంచి మిల్లులకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు ఇబ్బందులకు గురుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగొలు జరిగిన అనంతరం రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్నా.. అధికారులు, మంత్రులు స్పందించడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్ప నూరుపుళ్లు మార్చి తర్వాత కూడా జరుగుతాయని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే ప్రయతాన్నాలు చేయడం లేదన్నారు. మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని, రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి కృషిచేయాలని చురకలు అంటించారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని వైఎస్సార్ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని మిల్లులకు తరలించి, ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు.