సోదరిని ప్రేమించాడని హత్యాయత్నం- కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి రజని భర్త ఒత్తిడి - MinisterHusband InvolvedKidnap Case - MINISTERHUSBAND INVOLVEDKIDNAP CASE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 5:26 PM IST
Minister Rajini Husband Involved in Kidnap Case: దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చంపేందుకు యత్నించిన వారిపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజని భర్త ఒత్తిడి చేస్తున్నారని గుంటూరు ఎన్ఎస్యుఐ నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలోని ఐటీసీ సుభాని హోటల్ వద్ద శనివారం తరుణ్ జైన్ అనే వ్యక్తి అతని మిత్రులతో కలిసి తనను కిడ్నాప్ చేశారని ఎస్సీ యువకుడు నరసింహారావు తెలిపారు. తరుణ్ జైన్ సోదరిని ప్రేమించానన్న కారణంతో కిడ్నాప్ చేసి దాడి చేశారని బాధితుడు వాపోయాడు. రాత్రంతా కారులోనే తిప్పుతూ భౌతికంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించినట్లు బాధితుడు తెలిపాడు.
బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితులు తనను కిడ్నాప్ చేసిన చోటే వదిలేశారని వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి విడదల రజని భర్త ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు బాధితుడు నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి కిడ్నాప్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.