ధాన్యం కొనుగోళ్లు రైతు కేంద్రంగా చేపట్టాలి - ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుంది : మంత్రి నాదెండ్ల - Review on Paddy Procurement - REVIEW ON PADDY PROCUREMENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 5, 2024, 3:01 PM IST
Minister Nadendla Manohar Review on Paddy Procurement : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు రైతు కేంద్రంగానే చేపట్టాల్సిందిగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ ప్రక్రియను తొలగిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు అసోసియేషన్ తో పాటు రైతు సంఘాలతో సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ఎక్కువ సార్లు తిరక్కుండా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. గోనె సంచులు, లేబర్ రవాణా ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వెల్లడించారు.
బయోమెట్రిక్ ఆధారంగా కొనుగోలు చేపట్టాల్సిందిగా సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు GPS తప్పనిసరి చేయాల్సిందేనన్న మంత్రి చెల్లింపులు కూడా గతం కంటే వేగంగా చేయాలని స్పష్టం చేశారు. మిల్లింగ్ సామర్ధ్యంలో 75 శాతాన్ని నిర్దేశించామన్నారు. అలాగే విద్యుత్ వినియోగం ఎంత ఉందన్న అంశాన్ని కూడా ట్రాకింగ్ చేస్తామని వెల్లడించారు. కాకినాడ, కోనసీమ, తూర్పు, కృష్ణా జిల్లాలోని రైస్ మిల్లుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను FCIకి సరఫరా చేయాలని సూచించారు. మిల్లింగ్ చేసిన ప్రతీ గోనె సంచిపై ఓ విశిష్ట సంఖ్యను ముద్రిస్తామని మంత్రి తెలిపారు.