యథా సీఎం తథా మంత్రులు- జగన్ పాలనలో సెక్రటేరియట్ దుస్థితిపై లోకేశ్ విసుర్లు - Lokesh on Secretariat Maintenance - LOKESH ON SECRETARIAT MAINTENANCE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 7:46 PM IST
Lokesh Comments on Secretariat Maintenance: మంత్రిగా నారా లోకేశ్ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే సచివాలయం నిర్వహణపై లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన ఛాంబర్‌తో పాటు సచివాలయంలో గదులు నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులు సెక్రటేరియట్‌కు వచ్చే వారా అంటూ లోకేశ్ అధికారులను అడిగారు.
మంత్రులు సెక్రటేరియట్లో అందుబాటులో ఉండేవారు కాదని అధికారులు చెప్పారు. జగనే సచివాలయానికి రానప్పుడు మంత్రులు ఎలా వస్తారులే అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. క్యాబినెట్ మీటింగ్‌కు వచ్చినా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లడమే కదా అని లోకేశ్ అన్నారు. సెక్రటేరియట్ నిర్వహణకు కేటాయించిన నిధులు కూడా లేవని ఉద్యోగులు చెప్పారు. ఆ నిధులు వేరే అవసరాలకు మళ్లించి ఉంటారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.