'సముద్ర గర్భంలో శ్రీరాముడు'- 22 అడుగుల లోతులో స్కూబా డైవర్స్ ఏంచేశారంటే! - సముద్రంలో రాముడి చిత్ర ప్రదర్శన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 2:56 PM IST
Lord Sri Rama Image Display Inside Sea Water at Visakha: విశాఖ రుషికొండ బీచ్ వద్ద సముద్రపు నీటి లోపల స్కూబా డైవర్స్ శ్రీ రాముని చిత్ర ప్రదర్శన చేశారు. అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ఠాపన పురస్కరించుకొని మహాసముద్ర రాయబారులు ఈ ప్రత్యేకమైన ప్రయత్నాన్ని చేపట్టారు. లైవ్ ఇన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరామ విగ్రహంతో నీటి అడుగున ప్రదర్శించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠకు ప్రతీకగా సముద్రంలోని 22 అడుగుల లోతులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కరణ సందర్భంగా ఊరూవాడా భక్తజనం శ్రీరాముని కొలుస్తూ ఊరేగింపులు, భజనలు నిర్వహిస్తున్నారు. రాములోరి ఆలయాలను చక్కగా అలంకరించి భక్తజనం పూజలు నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల నుంచి శోభాయాత్రలు చేపట్టారు. హిందూ ధర్మ ప్రచార సంఘ నాయకులు, ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.