ఇంకా అక్కడే తిష్ట వేసిన చిరుత - ఆందోళనలో స్థానికులు - Leopard at Diwancheruvu Forest - LEOPARD AT DIWANCHERUVU FOREST
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2024, 5:45 PM IST
Leopard active at Diwancheruvu Reserve Forest : గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే చిరుత సంచారం కొనసాగుతోంది. ఇప్పటికి రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యంలోనే తిష్ట విసిన చిరుత దర్జాగా తిరుగుతుండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థల మార్గదర్శకాల అనుగుణంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా అటవీ అధికారి ఎస్. భరణి చెబుతున్నారు. అభయారణ్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చిరుత కదలికలను పసిగట్టెందుకు కెమెరా ట్రాక్లను 50 నుంచి 100కు పెంచామన్నారు. అలాగే 4 బోన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చిరుత రాత్రి సమయాల్లోనే ఆహారం కోసం వేటాడుతుందని తెలిపారు. థర్మల్ డ్రోన్ కెమెరాల సాయంతో దానిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జాతీయ రహదారిపై బోర్డులు సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు. రోడ్డుకి ఇరువైపులా గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలని జిల్లా అటవీ అధికారి ఎస్. భరణి సూచించారు.