ప్రజలు బాగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి: లంకా దినకర్ - Lanka Dinakar on jagan corruption - LANKA DINAKAR ON JAGAN CORRUPTION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 7:07 PM IST
Lanka Dinakar Allegations On Jagan: జగన్ అసమర్థ పాలనలో పేదల జీవనం ప్రశ్నార్థకమైందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఆదాయాలన్నీ పడిపోవటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని దినకర్ ఆరోపించారు. సంక్షేమం పేరుతో జగన్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలతో జీవితాలను బాగు చేసుకునే అవకాశం ప్రజలకు వచ్చిందని, బాగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరలేదని లంకా దినకర్ విమర్శించారు. జగన్ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి, అప్పులు పెరిగి అభివృద్ధి శూన్యంగా మారిందని దినకర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పాలనలో వైఫల్యంతో ప్రస్తుతం రాష్ట్రంలో మధ్య తరగతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి నెత్తి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒకొక్కరిపై ఏడు లక్షల రూపాయిల వరకు అప్పుల భారం ఉందన్నారు. అన్ని రకాల రుణాలు కలిపి రాష్ట్రాన్ని 13 లక్షల కోట్లపైగా రూపాయల అప్పుల్లో ముంచారని దుయ్యబట్టారు.