పనులు కల్పించండి - లేకపోతే వలస పోతాం: ఉపాధి హామీ కూలీలు - Rural Employment Guarantee works - RURAL EMPLOYMENT GUARANTEE WORKS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 7:34 PM IST
Laborers Dharna for Rural Employment Guarantee Works : ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది కూలీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గత కొంతకాలంగా పనులు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జిల్లాలోని బూర్జి మండలం లోక్కుపురంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, గ్రామంలో పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఇళ్లు గడవక అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనులు కింద ప్రతి వ్యక్తికి 100 రోజుల పని దినాలను కల్పిస్తుందని వెల్లడించారు.
కానీ మా ఊరిలో మాత్రం 100 రోజుల పని ఎప్పుడూ కేటాయించ లేదని మండిపడ్డారు. చుట్టు పక్కల ఉన్న అన్ని గ్రామాల్లో పనులు సక్రమంగా జరుగుతున్నాయి. మా ప్రాంతంలో మాత్రం ఎటువంటి పనులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే కుటుంబాన్ని ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతో ధర్నా చేపట్టామని గ్రామస్థులు తెలిపారు. పనులు కల్పించకపోతే తాము వేరే ప్రాంతానికి వలస పోతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.