ఆరోపణలపై స్పష్టత వచ్చాకే సీఎస్ సెలవులపై వెళ్లాలి: మూర్తి యాదవ్ - Murthy Yadav on Former AP CS - MURTHY YADAV ON FORMER AP CS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 5:23 PM IST
Janasena Murthy Yadav on Former CS Jawahar Reddy Land Grabs: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములను మాజీ ప్రభుత్వ కార్యదర్శి జవహార్ రెడ్డి దోచుకున్నారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలు మాయం కాకుండా విశాఖ జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలు రుజువు అయిన తర్వాతే మాజీ సీఎస్ సెలవులపై వెళ్లారని డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఫ్రీ హోల్డ్ పట్టాల జారీ ద్వారా విశాఖ కలెక్టర్ ఈ భూములను అన్యాక్రాంతం చేశారని తెలిపారు. అసైన్డ్ భూములను సీఎస్ కుమారుడు అతని అనుచరులు, వైసీపీ నాయకులు సొంతం చేసుకున్నారని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దృష్టి సారించి న్యాయ విచారణ కానీ, సీబీఐ విచారణ కానీ జరిపించి చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్ విజ్ఞప్తి చేశారు.