టీడీపీ-జనసేన తొలి జాబితా - సాక్షి కథనాలను ఖండించిన జన సైనికులు - టీడీపీ జనసేన ఉమ్మడి తొలి జాబితా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 8:59 PM IST
Janasena Leaders Fire On Sakshi Article in Ongole : టీడీపీ, జనసేన ఉమ్మడి తొలి జాబితాలో ఒక సీటు దక్కకపోవడంతో ఒంగోలు జిల్లా జనసేనలో నైరాశ్యం నెలకొంది అని సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని జనసేన నాయకులు పిల్లి రాజేష్ ఖండించారు. జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో సాక్షి పత్రికలో (Sakshi News Paper) వచ్చిన కథనానికి వ్యతిరేకిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాజేష్ మాట్లాడుతూ రాయాల్సింది అది కాదని ఒంగోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA) కనపడడం లేదని రాయాల్సిందని ఎద్దేవా చేశారు.
టీడీపీ, జనసేన (Janasena) పొత్తును సహించలేక సాక్షి పత్రికలో ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ లాగా మేము ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూములను దోచుకుని పార్టీ ఆఫీసులను ఏర్పాటు చేసుకోలేదని చురకలు వేశారు. ఇంకోసారి సాక్షి పత్రికలో ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తే సాక్షి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నాయకులు సాక్షి పేపర్లను మంటలో దగ్ధం చేశారు.