ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలంటీర్ వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యాయత్నం: జనసేన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:12 PM IST

Janasena Leader Gade Venkateswara Rao: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో వాలంటీర్ శ్రీకాంత్​రెడ్డి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను, గుంటూరుజిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు పరామర్శించారు. అనంతరం గాదె  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని ఆరోపించారు. పాలపాడులో వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని గాదె వెంకటేశ్వరావు విమర్శించారు. వాలంటీర్ పదవిని అడ్డంపెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి రెచ్చిపోవడం దారుణమని ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి ఒక మృగంలా ప్రవర్తించాడని మండిపడ్డారు.

వాలంటీర్​ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు చేశారంటూ కేసు పెట్టిన విషయాన్ని గాదె గుర్తుచేశారు.  వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి విషయంలో వైఎస్సార్సీపీ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందనడానికి పాలపాడు ఘటన ఒక ఉదాహరణ అని గాదె దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను శ్రీకాంత్ రెడ్డి  వేధింపులకు గురి చేశాడని గాదె అరోపించారు. తిరిగి తన తప్పు లేదంటూ శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.  

పల్నాడులో బీసీలకు టికెట్ కేటాయిస్తున్నట్లు సీఎం జగన్ చెబుతున్నారని, మరోపక్క అదే బీసీలపై దాడులు చేపిస్తారా అని ప్రశ్నించారు.   ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు ఏమైనా జరిగితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డే పూర్తి బాధ్యత వహించాలని గాదె పేర్కొన్నారు. ఇలాంటి వారిపై దిశా, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 
 

ABOUT THE AUTHOR

...view details