మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన పార్టీ - JSP Declared One More Candidate - JSP DECLARED ONE MORE CANDIDATE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 4:49 PM IST
Janasena Declared One More Candidate: జనసేన మరో అసెంబ్లీ అభ్యర్థిని ప్రకటించింది. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ పార్టీ ముఖ్య నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును ఖరారు చేశారు.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, కూటమిలో భాగంగా పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 19 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తాజాగా మరో ఎమ్మెల్యే స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. ఈ క్రమంలో అవనిగడ్డ, పాలకొండ శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.