రాష్ట్రంలో వైభవంగా జగన్నాథస్వామి రథయాత్ర వేడుకలు - Jagannath Swamy Ratha Yatra - JAGANNATH SWAMY RATHA YATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 7, 2024, 10:49 PM IST
Jagannath Swamy Ratha Yatra Celebrations in AP: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మెుక్కులు చెల్లించుకున్నారు.
Visakhapatnam: విశాఖలోని పలు ప్రాంతాల్లో జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్కళ దేవాలయం వద్ద రథోత్సవం కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు జనసందోహంలా తరలొచ్చారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో పిల్లలు, మహిళల కోలాటాలు కన్నుల పండువగా సాగాయి. బీచ్ రోడ్డు నుంచి ఆర్ కే బీచ్ మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు రథయాత్ర కొనసాగింది. విశాఖ వన్ టౌన్లో ఘనంగా జగన్నాథుడి రథయాత్ర భక్తులతో జనసందోహంలా మారింది. జగన్నాథ ఆలయం నుంచి టర్నర్ చౌల్ట్రీ వరకు కొనసాగిన రథయాత్రలో భక్తులు పోటెత్తారు.
Anakapalli: అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవాన్ని నిర్వాహుకులు ఘనంగా ప్రారంభించారు. గవర్నపాలెంలోని అగ్గిమరి చెట్టు నుంచి ఇంద్రజుమ్నహాల్ వరకు స్వామి వారి రథయాత్రను కొనసాగించారు. కార్యక్రంలో ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రథాన్నిలాగి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మెుక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఇబ్బందులు గురికాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.