బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక కుట్ర కోణం - పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు - Irrigation Dept Complaint to Police - IRRIGATION DEPT COMPLAINT TO POLICE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 10:30 PM IST
Irrigation Officials Complained to Police : ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీ కొట్టటంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ పోలీసు స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. నాలుగు మర పడవలు ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందేమోనని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో కోరారు. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారు జామున మూడు భారీ మర పడవలు, ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయని తెలిపారు. దీంతో రెండు గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయని వివరించారు. ఒకేసారి నాలుగు రావటం వెనక అనుమానాలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పడవలు ఢీకొని ధ్వంసమైన కౌంటర్ గేట్లను తొలగించారు. సుమారు 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్లను క్రేన్లతో బయటకు తీశారు. ముందుగా బెకెమ్ ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో గేట్ల కౌంటర్ వెయిట్లను గ్యాస్‌కట్టర్లతో తొలగించారు. అనంతరం 67, 68 , 68 గేట్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. గేట్లకు అడ్డుగా ఉన్న 3 భారీ పడవల తొలగింపునకు చర్యలు చేపట్టారు. రేపు ఉదయానికి ప్రకాశం బ్యారేజ్ వద్దకు కౌంటర్ వెయిట్లు చేరుకుంటాయి. అనంతరం కొత్త కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తారు. బ్యారేజ్ అధికారులు, డ్యాం సేఫ్టీ, ఇంజనీరింగ్ నిపుణలు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.