పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న నిపుణుల బృందం పరిశీలన - International Experts at Polavaram - INTERNATIONAL EXPERTS AT POLAVARAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 3:26 PM IST
International Experts Polavaram Visit 2nd Day: పోలవరం ప్రాజెక్టు వద్ద అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలన రెండో రోజూ కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని నిపుణుల బృందం పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, కాఫర్ డ్యామ్‌ను నిపుణులు క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులతో చర్చించనున్నారు. రేపు, ఎల్లుండి కూడా ఈ మేధోమథనం కొనసాగనుంది. ఆ తర్వాత అన్ని అంశాలను క్రోడీకరించి, పోలవరం ప్రస్తుత పరిస్థితి, జరిగిన నష్టం, ఇతర వివరాలతో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.
Polavaram Visit 1st Day: తొలిరోజు రాష్ట్ర జల వనరుల సలహాదారు వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సీఈ, ప్రస్తుత ఎస్ఈ కె.నరసింహమూర్తితో భేటీ అయ్యి పనుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి స్పిల్‌వేకు చేరుకుని ప్రాజెక్టు మ్యాప్ పరిశీలించారు. అదే విధంగా ఎగువ కాఫర్ డ్యాం పైకి చేరుకున్న వారికి, గతంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫొటోలతో పాటు సాంకేతిక వివరాలను సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ ఆశ్వినీకుమార్ వర్మ వివరించారు. ఎగువ కాఫర్ డ్యాంపై మూడుచోట్ల జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ తీసిన మట్టి నమూనాలను కూడా తొలిరోజు నిపుణుల బృందం పరిశీలించింది. తిరిగి దిగువ కాఫర్ డ్యాం సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఫొటోలు, సాంకేతిక వివరాలను పరిశీలించారు. మధ్యాహ్నం గ్యాప్-1 నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.