భార్యను నరికి ఇంటి ముందే కత్తిపట్టుకుని కూర్చున్న భర్త- ఏలూరు జిల్లాలో దారుణం - HUSBAND KILLED WIFE - HUSBAND KILLED WIFE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 7:29 PM IST
Husband Brutally Hacked his Wife to Death in Eluru District : కట్టుకున్న భార్యను నరికి చంపిన దారుణమైన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో భార్యను భర్త హత్య చేశాడు. ఈ దారుణ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సూర్యచంద్రం, భార్య సాయి లక్ష్మి (35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి బుధవారం భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సాయిలక్ష్మి మెడపై భర్త సూర్యచంద్ర కత్తితో నరికాడు. దీంతో సాయిలక్ష్మి ఘటనస్థలిలోనే విలవిల్లాడుతూ మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొయ్యలగూడెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన సూర్యచంద్రం ఇంటి ముందే కత్తి పట్టుకుని కూర్చోవడం గమనార్హం.