ఎన్నికల సనద్దతపై కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫరెన్స్ - పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని సూచన - ఎన్నికల భద్రతపై వీడియో కాన్ఫరెన్స్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 9:17 PM IST
Home Secretary For Video Conference on Election Security: ఏపీలో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సుకు సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా అధికారులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా అజయ్‌భల్లా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు కోసం 465 కంపెనీల కేంద్ర పారామిలటరీ పోలీసు బలగాలు అవసరమవుతాయని ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి హోంశాఖ కార్యదర్శిని కోరారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగినట్టుగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని అజయ్‌భల్లా సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న బందోబస్తు, తదితర వివరాలపై ఆయన ఆరా తీశారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు 58 కంపెనీల ప్రత్యేక సాయుధ బలగాలు కూడా అవసరమవుతాయని సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ప్రత్యేక రూపకల్పన తగు జాగ్రత్తలపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించడం జరిగింది.