భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలక ఘట్టం - విశాఖ హిందుస్థాన్ షిప్‌యార్డు ముందడుగు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 26, 2024, 9:24 PM IST
Green Hydrogen news Today: భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖ హిందుస్ధాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ముందడుగు వేసింది. సముద్రంలో ఉపయోగించే ఈ పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని హిందుస్ధాన్ షిప్ యార్డు సిద్ధం చేసింది.
కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, భారతీయ పరిశ్రమ భాగస్వామి-లోటస్ వైర్‌లెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ టెక్నాలజీని హెచ్ఎస్ఎల్ (హిందుస్థాన్ షిప్ యార్డు) రూపొందించింది. భారతీయ సముద్ర రంగానికి అత్యాధునిక హైడ్రోజన్ ఇంధన సెల్ టెక్నాలజీని పరిచయం చేసేందుకు ఇది తోడ్పడుతుందని హెచ్ఎస్ఎల్ వెల్లడించింది. హైడ్రోజన్ ఇంధన బ్యాటరీలు 250 kw నుంచి 2 MW వరకు తయారీకి ఈ టెక్నాలజీ ఉపకరిస్తుందని ప్రకటించింది. పూర్తి సురక్షితంగా వివిధ సముద్ర ఉపకరణాలకు సరిపోయే రీతిలో వీటిని సిద్ధం చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సంప్రదాయ డీజిల్ తో నడిచే వ్యవస్థలకు స్ధిరమైన ప్రత్యామ్నాయంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత పని చేస్తుందని తెలిపింది. సముద్రపు పరికరాలకు, వాటి అవసరాలకు సరిపడా ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికను అందిస్తామని హిందుస్థాన్ షిప్ యార్డు వెల్లడించింది. ఇంధన కణాలతో భారతదేశ సముద్రపు భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఒక మార్గదర్శక అడుగుగా దీనిని అభివర్ణించింది.