Mini Sammakka Saralamma Jatara 2025 : తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2025 ఫిబ్రవరిలో 12 నుంచి 15 తేదీ వరకు నాలుగు రోజులు మినీ జాతరను నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మేరకు పూజారులు ఆలయ ఈవోకు ఆహ్వాన పత్రం పంపారు. మినీ మేడారం జాతరకు కూడా భక్తులు భారీగానే వస్తారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతుంటాయి. గద్దెల ముందు పొర్లు దండాలు పెట్టి బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న మేడారం జన జాతరను 4 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వచ్చే ఏడాది మినీ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేయనుంది. తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు, రవాణా, భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
Medaram: సమ్మక్క-సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే..?
మేడారం జాతర నేపథ్యం ఏంటంటే? : కాకతీయ సేనలు గిరిపుత్రులను వేధిస్తుంటే కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలు. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ మేడారంలో జాతర చేస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క- సారలమ్మ జాతర పేరు పొందింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో మొదలుకొని వన దేవతల ఆగమనంతో అసలైన మహా జాతర ప్రారంభమవుతుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన వన వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి భావంతో అమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.
దీపావళికి మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు - ఈ గుడి విశేషాలు మీకు తెలుసా ?
షష్టిపూర్తి వేడుకలకు ప్రత్యేక ఆలయం - ఈ మహిమాన్విత క్షేత్రాన్ని దర్శిస్తే గండాలన్నీ దూరం!