ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే విధుల నుంచి తొలగిస్తారా? : గురుకుల ఉద్యోగులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:44 PM IST
Gurukula Employees Fire on AP Government : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరితే విధుల నుంచి తొలగించడం ఏంటని అనంతపురం గురుకుల విద్యాలయాల మ్యాన్ పవర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. గురుకుల విద్యాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా బోధనేతర సిబ్బంది కింద దాదాపు 800 మంది పని చేస్తున్నామని తెలిపారు. రూ.2500 వేతనం నుంచి పనిచేసిన తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోర్టుకు వెళితే అధికారులు తమను విధుల నుంచి తొలగించారని వాపోయారు.
Gurukulam Employees Protest : గురుకుల విద్యాలయాలనే నమ్ముకుని జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం కడుపుకోత మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.