"జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామవార్డు సచివాలయాలు" - Ap Government Released Orders
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 9:13 AM IST
Grama Ward Secretariats as Joint Sub-Registrar Offices : నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఉచిత ఇంటిస్థలాల రిజిస్ట్రేషన్ల కోసం గ్రామ వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలు ఇక నుంచి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా విధులు నిర్వహించేలా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
గ్రామ వార్డు సచివాలయాల్లోనే జగనన్న శాశ్వత స్థలాల హక్కు పథకం కింద సెంటు భూమి ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. సచివాలయాల్లోని పంచాయితీ కార్యదర్శులు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి రెండు వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ సిఫార్సుల మేరకు ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కోంది. ఈ నోటిఫికేషన్ తక్షణం అమల్లోకి వస్తుందని ఉచిత ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ల వరకూ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.