ఎన్నికల్లో లబ్దిపొందేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడ- వాలంటీర్లకు నగదు పురస్కారం పెంపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 12:07 PM IST
Government Hike Volunters Awards Prize Money: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్దిపొందేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడకు తెరతీసింది. వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పన్నాగాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని ఒక్కసారిగా పెంచింది. సేవా వజ్ర పురస్కారం మొత్తాన్ని 30వేల రూపాయల నుంచి 45వేలకు, సేవారత్న పురస్కారం మొత్తాన్ని 20వేల రూపాయల నుంచి 30వేలకు, సేవామిత్ర పురస్కారం మొత్తాన్ని 10వేల రూపాయల నుంచి 15వేలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2లక్షల 55వేల 464 మంది వాలంటీర్లకు 392కోట్ల రూపాయలు నగదు పురస్కారాలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవావజ్ర, సేవామిత్ర, సేవారత్న అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 7రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈ సేవా కార్యక్రమాన్ని గురువారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వద్దని ఈసీ తెలిపిన వాటిని బేఖాతరు చేసి కొంతమంది ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు కోరుతున్నారు.