ఆ ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశం కల్పించాలి : కేఆర్ సూర్యనారాయణ - Employees Round Table - EMPLOYEES ROUND TABLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 1:13 PM IST
Government Employees Round Table Meeting in East Godavari : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడవు ముగిసిన అనంతరం కొంత మంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారని, ఇలాంటి వారు 50 వేల మంది వరకు ఉంటారని సూర్యనారాయణ పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి సరికాదని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పుడు వరకు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉందని అంచనా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ సత్వరం అమలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సర్వీసు రూల్స్ అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గించాలన్నారు.