రోజుకు రూ.10 లక్షల అక్రమ సంపాదన లేనిదే నిద్రపోవటం లేదు : చింతామోహన్ - Former Union Minister
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 6:51 PM IST
Former Union Minister Chinta Mohan Press Meet : వైఎస్సార్సీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ విమర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పరిపాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి రాజ్యమేలుతోందన్నారు. మీడియాపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియాపై దాడులు చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ హరించుకుపోతుందన్నారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని వెల్లడించారు.
నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా లంచం లేనిదే పనులు జరగటం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు రూ. కోట్లలో అవినీతిగా డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలు రోజుకు రూ.10 లక్షల అక్రమ సంపాదన లేనిదే నిద్రపోవడం లేదని వెల్లడించారు. అలాగే మంత్రి రూ. కోటి రూపాయలు లేకుండా నిద్రపోవటం లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి వేల కోట్లు అక్రమంగా సంపాదించారని తెలిపారు. రాష్ట్రానికి తిరుపతిని రాజధానిని చేస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు.