విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - లక్షల్లో ఆస్తి నష్టం - Rajam Fire Accident Today - RAJAM FIRE ACCIDENT TODAY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 8:47 AM IST
Rajam Fire Accident Today : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజాం మండలం పెనుబాక సమీపంలోని సీతారామ ఆయిల్ మిల్లులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మిల్లులో ఉన్న ముడి సరుకులకు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున అగ్నికీలలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో అందులో పనిచేసే కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు అగ్నిమాపకశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Fire Accident in Penubaka : ఘటానాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మిల్లులో ఉన్న ముడి సరుకులకు మంటలు అంటుకొని ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడివారు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.