పసికూన కోసం- ఆక్సిజన్ సిలెండర్‌తో తండ్రి పరుగులు - వీడియో వైరల్ - Father Holding Oxygen Cylinder - FATHER HOLDING OXYGEN CYLINDER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 12:50 PM IST
Father Holding Oxygen Cylinder Video Viral KGH : విశాఖలోని కేజీహెచ్‌లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ తండ్రి పడిన కష్టానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణీని కుటుంబ సభ్యులు మంగళవారం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మినివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో (NICU) లో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి NICU (Neonatal Intensive Care Unit) కు బయలుదేరారు.
సమయానికి సిబ్బంది లేకపోవడంతో బిడ్డ తండ్రి ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని నర్సు వెనుక నడిచారు. ఈ దృశ్యాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న ఆసుపత్రి పర్యవేక్షక వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి KGHలో బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామని తెలిపారు.