పోలీసు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం - కోట్లలో వసూళ్లు - fake Police Jobs
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 7:27 PM IST
Fake Police Jobs in Visakhapatnam : విశాఖలో పోలీస్ యూనిఫాం అడ్డు పెట్టుకుని ఓ జంట నిరుద్యోగుల్ని నిండా ముంచింది. పోలీస్ శాఖలో ఉద్యోగులమని, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల్ని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని మభ్యపెట్టింది. ఇలా దాదాపు 30 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు డబ్బులు చెల్లించినా వారికి ఉద్యోగాలు రాలేదు. చివరికి పోలీసులను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. నిరుద్యోగులకు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోసం చేసిన నిందితుడు రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణానికి చెందిన రమేష్ ఓ మహిళతో కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని హైదరాబాద్‌లో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉద్యోగాల పేరిట ఈ జంట సుమారు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. యూనిఫారం ధరించి మోసాలు చేసినట్లు గుర్తించారు. రమేష్ కొంతకాలంగా అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఘరానా మోసానికి పాల్పడిన నిందితుడు పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడిన నిందితుడు తాజాగా పోలీస్ డ్రామాకు తెర తీసినట్టు పోలీసులు వెల్లడించారు.