ఒలింపిక్స్ గేమ్స్‌లో మెడల్స్ తీసుకొస్తే దేశానికే గౌరవం: మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ - Olympic Run in Kurnool
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 11:56 AM IST
EX MP TG Venkatesh on Olympics : ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడమే ఎంతో గౌరవమని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. భారతీయ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే మన దేశానికే గౌరవం లభిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే కర్నూలులో క్రీడా మైదానాలు అభివృద్ధి చేశామన్నారు. ఈ విధంగానే అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. పట్టణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Olympic Run in Kurnool : అంతకుముందు ఒలింపిక్స్ క్రీడలు రేపటి నుంచి పారిస్‌లో ప్రారంభం కానున్న సందర్భంగా, ఇందులో పాల్గొనే భారతీయ క్రీడాకారులకు సంఘీభావంగా కర్నూలులో ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. దీనిని టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుంచి కొండారెడ్డి బురుజు వరకు సాగింది. కర్నూలులో 10 ఇండోర్ స్టేడియంలు ఏర్పాటు చేశామని టీజీ వెెంకటేష్ అన్నారు. కానీ గత సర్కార్ వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చిందని ఆయన ఆరోపించారు. ఈసారి ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు 117 మంది పాల్గొంటున్నారని, అందరూ సత్తా చాటి మెడల్స్ తీసుకురావాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ శంకర్‌శర్మ ఆకాంక్షించారు.