జల దిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గామాత ఆలయం - భక్తులకు తప్పని ఇబ్బందులు - Edupayala Temple Submerged
Published : Sep 6, 2024, 11:37 AM IST
Edupayala Temple Submerged : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం 6 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. గర్భగుడి ముందున్న నదీపాయ ఆలయ మండపానికి ఉన్న రేకులను ఆనుకొని గర్భగుడి నుంచి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
గర్భగుడిలోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారికి అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. వరద తగ్గగానే మూలవిరాట్, అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు, మత్య్సకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని నీటి పారుదల శాఖ అధికారులు స్థానికులకు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.