ఈ-రేసింగ్ పోటీల్లో తమ నైపుణ్యాలు ప్రదర్శించిన విద్యార్థులు - BAHA Racing Competitions in BVRIT
Published : Mar 10, 2024, 1:23 PM IST
E-Racing Competitions in BVRIT Collage : మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాలలో గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ-బజా సేఇండియా 2024 ఈ-రేసింగ్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మెుత్తం 71 బృందాలు రాగా వాటిలో నిబంధనల ప్రకారం ఉన్న 46 వాహనాలను మాత్రమే పోటీల్లోకి అనుమతించారు. ప్రతి జట్టులో 25 మంది విద్యార్థులుండగా వీరిలో ఇద్దరు వాహన చోదకులుగా ఉన్నారు.
విద్యార్థుల చప్పట్లు, కేరింతల నడుమ పోటీలు ఉత్సాహాంగా కొనసాగాయి. కళాశాల సమీపంలోని రామచంద్రాపూర్ చెరువు ప్రాంతంలో పోటీలు నిర్వహించారు. మొత్తం చెరువు 2.2 కిలోమీటర్ల పొడవున ట్రాక్ నిర్మించారు. పోటీదారులు తమ విద్యుత్ వాహనాలను ఉపయోగించి గతుకులు, నీరు, బురద,రాళ్లు, ఎత్తపల్లాలు, గుంతలు, ప్రమాదకర మలుపులు ఉన్న మార్గంలో పోటీపడ్డారు. మొత్తం 4 గంటల సమయంలో ట్రాక్ చుట్టూ 30 రౌండ్లలో పోటీ జరిగింది.
ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతిగా రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ బహుమతిగా రూ.15వేల రూపాయల చొప్పున అందించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి పోటీల్లో పాల్గొనడం తొలిసారి అయినా మంచి థ్రిల్లింగ్ అనిపించిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీల ద్వారా తాము ఇంకా మెరుగైన మెళుకవలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ పోటీలు మన దక్షిణ భారత దేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి అని దానికి ప్రభుత్వం కూడా సహకరించిందని బీవీఆర్‌ఐటీ యాజమాన్యం తెలిపింది.