అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ- తీవ్ర అవస్థలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 6:20 PM IST
Distribution of Houses With Lack of Facilities in Visakhapatnam: పేదలకు సొంతింటి కళ నెరవేర్చడటమే నా ధ్యేయం, నేను పేదల పక్షపాతి అని జగన్ చెప్పే మాటలకు క్షేత్రస్థాయి పనులకు సంబంధం ఉండదు. వీటికి నిదర్శనం విశాఖలో పంపిణీ చేసిన టిడ్కో గృహాలు. ఇళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొెంటున్నారు. సుమారు 80 శాతం పనులు టీడీపీ హయాంలో పూర్తయినా అరకొర పనులు పూర్తి చేయటంలో జగన్ సర్కార్ వైఫల్యం చెందటంతో తాము అనేక అవస్థలు పడుతున్నామని స్థానికులు తెలిపారు.
కేవలం మౌలిక వసతుల కల్పనకే నాలుగున్నరేళ్లు సమయం తీసుకున్న వైసీపీ ప్రభుత్వం మురుగు నీరు పారుదల, ఉద్యానవనం, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చెయ్యలేదని వారు ఆరోపించారు. నాసిరకం పైపులైన్లు వాడటంతో లీకేజీల సమస్య పీడిస్తోంది. విశాఖ చిలకపేట సి. హార్స్ జంక్షన్ సమీపంలో టిడ్కో గృహాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మురుగు నీరు సమీపంలోని వీధుల్లోకి వెళ్తుంది. దీంతో నిత్యం రాకపోకలకు ఈ రహదారి ద్వారా వెళ్లే పిల్లలు, పెద్దలకు ఆనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.