'బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్'పై మంత్రి పవన్ చర్చ- ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం - Pawan on Blue Economy Project in AP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 10, 2024, 10:33 AM IST
Pawan on Blue Economy Project in AP : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏపీలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో వరుసగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్తలు అవనీష్కాంత్, పి.సిద్దార్ధతో సమావేశమయ్యారు.
Pawan Meet World Bank Representatives : ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర వనరుల సమర్ధ వినియోగం, బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్ అమలు అంశంపై పవన్ కల్యాణ్ వారితో చర్చించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ అమలుకు వరల్డ్ బ్యాంక్ అందిస్తున్న ఆర్ధిక, సాంకేతిక సహాయాలను బ్యాంకు ప్రతినిధులు పవన్‌కి వివరించారు. అదే తరహాలో బ్లూ ఎకానమీ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేసేందుకు ఉన్న అనుకూలతలను వారికి ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక సహాయం అందించాలని పవన్ కల్యాణ్ వారిని కోరారు. ఇందుకు వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.