కులగణనలో వేలిముద్ర - బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం - కులగణన పేరుతో సైబర్ క్రైమ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 1, 2024, 3:39 PM IST
Cyber Crime By the name Of Census: కులగణనకు సంబంధించి వేలిముద్ర వేసిన తరువాత తమకు తెలియకుండానే తమ ఖాతాలో డబ్బులు పోయాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా పలువురి బ్యాంక్ ఖాతాల్లో నగదు డ్రా చేసినట్లు వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయని బాధితులు తెలిపారు. బ్యాంకు వద్దకు వెళ్లి అడగగా, మీరు ఎక్కడైనా వేలిముద్ర వేశారా అని అడగారు. కుల గణనకు సంబంధించి గ్రామాల్లో అధికారులు వేలిముద్రలు వేయించుకున్న తరువాత పోయాయని తెలపడంతో సైబర్ క్రైమ్ వల్ల డబ్బులు పోయాయని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బ్యాంక్ అధికారులు తెలిపారన్నారు.
బాధితులు రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని వారికి మద్దతు తెలిపి కుల గణనకు వేలిముద్రలు లేకుండా లెక్కింపు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలా ఇద్దరు వ్యక్తుల ఖాతాల నుంచి 14 వేల 500 వరకు నగదు మాయమైనట్లు తెలుస్తోంది.