అమరావతికి అధికారగణం- సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాలను పరిశీలించిన సీఎస్ నీరభ్ - CS Neerabh Visits Amaravati Villages
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 7:23 PM IST
CS Neerabh Visits Capital Amaravati Villages: రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా ఆగిన పనులన్నీ ప్రారంభమయ్యాయని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. రాజధానిలో పర్యటించిన ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న క్రమంలో సీఎస్ పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. రాజధానికి భూమి పూజ చేసిన ఉద్దండ రాయునిపాలెంలోని సీఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని తొలుత సీఎస్ సందర్శించారు. తదుపరి అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయ భవనాలు, ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవో నివాస భవనాల సముదాయాలను పరిశీలించారు. హైకోర్టు సహా పలుచోట్ల ఆయన పర్యటించారు. రెండు, మూడ్రోజుల్లో రాజధానిలో క్లీనింగ్ పనులు పూర్తి చేస్తామని సీఎస్ నీరభ్ చెప్పారు.
"రాజధానిలో ఐదేళ్లుగా ఆగిన పనులన్నీ ప్రారంభం అయ్యాయి. 94 జేసీబీలతో 35 ప్రాంతాల్లో పనులు క్లీనింగ్ పనులు చేపట్టాం. రెండు, మూడ్రోజుల్లో క్లీనింగ్ పనులు పూర్తి చేస్తాం. క్లీనింగ్ పనులు పూర్తయ్యాక రాజధాని నిర్మాణాలపై సీఎంతో చర్చిస్తాం. బెవరేజస్, మైనింగ్, సీఐడీ కార్యాలయాలను సీజ్ చేశాం. కీలక దస్త్రాలు బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం." - సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్