ప్రధాని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 6:28 PM IST
CPI State Secretary Fires On Central Govt : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కర్నూలు లోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడుతుంటే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కేంద్రాన్ని ప్రశ్నించ లేదన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
మద్యం స్కాం లో దిల్లీ ఉపముఖ్యమంత్రిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కాం జరుగుతున్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 100 కోట్ల స్కాం జరుగితే సంవత్సరం పాటు దిల్లి ఉపముఖ్యమంత్రిని జైలులో ఉంచితే వెయ్యి కోట్ల స్కాం చేసిన జగన్మోహన్ రెడ్డిని 1000 సంవత్సరాలు జైల్లో ఉంచాలని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని చెప్పి ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయారన్నారు.