కరువొచ్చిన ఆర్నెళ్లకు అధికారులొచ్చారు- కేంద్రంపై రామకృష్ణ ఫైర్ - Ramakrishna criticized central govt - RAMAKRISHNA CRITICIZED CENTRAL GOVT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 7:05 PM IST
CPI Ramakrishna Criticized Central Government : వర్షాలు పడి రైతులు పంటల సాగుచేసే సమయంలో రాష్ట్రంలో కరువు తీవ్రతపై కేంద్ర బృందం పర్యటించడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. దీనిపై విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతులపట్ల శీతకన్ను వేసిందని విమర్శించారు. గత సీజన్లో దాదాపు 87 మండలాలలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని గుర్తుచేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించిందని విమర్శించారు.
ఆరు నెలల తరువాత కేంద్ర బృందం అధికారులు ఇప్పుడు వచ్చి ప్రకటనలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. రైతులకు పంట నష్టపరిహారం సాయం సక్రమంగా అందటంలేదని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులు పంటలకు పెట్టుబడి పెట్టుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సహాయం అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి రైతును ఆదుకోవడానికి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు.