Police Notices Once Again to Perni Nani Wife : బందరు తాలుకా పీఎస్‌లో విచారణకు పేర్ని జయసుధ హాజరయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సీఐ ఏసుబాబు పేర్ని జయసుధను విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని వెల్లడించారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు. ఇప్పటికే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె న్యాయవాదులతో కలిసి కలిసి బందరు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. జయసుధ తరఫు న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్.పేట సీఐ ఏసుబాబు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే, జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వ వాహనంలో ఆమె విచారణకు రావడం చర్చనీయాంశంగా మారింది.
పేర్ని జయసుధ విచారణ సమయంలో పీఎస్‌లో వైఎస్సార్సీపీ శ్రేణులు హడావిడి చేశారు. ఎంత సేపు విచారిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు పంపించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎంతసేపు విచారిస్తారని ఆమె లాయర్లు ప్రశ్నించారు.
మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు పేర్ని నాని నివాసానికి వెళ్లారు. నాని కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిన సంగతి తెలిసిందే.
రేషన్ బియ్యం కేసు - దూకుడు పెంచిన పోలీసులు - పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు
'అమ్ముకుని సొమ్ము చేసుకోండి - మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి'