బియ్యం గింజలతో రామాలయ ఆకృతి - రామయ్యకు రాజేంద్రుడి 'కళా'నివేదన
Published : Jan 20, 2024, 2:05 PM IST
Construction Of Ram Temple Pattern With Grains Of Rice : దేశమే కాదు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభం ఈ నెల 22న జరగనుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎవరికి వారు స్వామికి తమవంతుగా ఏదైనా సమర్పించాలి అనుకుంటున్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఓ సూక్ష్మ కళా నిపుణుడు ఉడతా భక్తిగా తన కళనే రాముడికి నివేదించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రయత్నం మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్కు చెందిన బిట్లింగు రాజేంద్ర వృత్తిరీత్యా ముంబయిలో ఉంటున్నాడు. మైక్రో ఆర్టిస్ట్ కావడంతో రాముడి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో తాను ఒకింత ప్రత్యేకంగా నిలవాలనుకున్నాడు. ఈ క్రమంలో బియ్యం గింజలతో రామాలయ ఆకృతిని రూపొందించాడు.
Bitlingu Rajendra From Nirmal : మామూలుగా అయితే ఇది చెప్పుకోదగ్గ విషయం కాకపోవచ్చు. కానీ, ప్రతీ గింజపై 'రాం' అనే అక్షరాలను రాశాడు. అవి ఉండేవే చిన్న పరిమాణంలో, వాటిపై ఇలా రాయడమంటే అంత సులభం కాదు. అది కూడా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాసేశాడు. ఇలా రాసిన వాటికి కొద్దిగా రంగులు జత చేసి రామాలయం, ఉడుతను ఆప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడి చిత్రపటాలను రూపొందించాడు. జనవరి 9న తన ప్రయత్నం మొదలుపెట్టిన ఈయన, 9 రోజుల్లో అంటే జనవరి 17 కల్లా పూర్తి స్థాయిలో దీన్ని సిద్ధం చేశాడు. ఈ చిత్రపటం నిర్వాహకుల వద్దకు చేరుతుందా లేదా అనే విషయం కన్నా, తనలోని నైపుణ్యం, చిత్రలేఖనం, సూక్ష్మ కళ ప్రత్యేకత ప్రపంచానికి చాటాలని, ఇంకొంతమంది ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రయత్నం చేసినట్లు కళాకారుడు పేర్కొన్నాడు.