పింఛన్ ఎందుకు ఆపారు ? - విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన సామాన్యుడు - pension distribution issue - PENSION DISTRIBUTION ISSUE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 3:31 PM IST
Common Man Deposed MP Vijayasai Reddy: పింఛన్ పంపిణీ అంశంపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒక్కరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం ఇంటి వద్దే పింఛన్ పంపిణీ కార్యక్రమం ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ప్రభుత్వాధికారుల ద్వారా పింఛన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆటంకాలకు అధికారా పార్టీయే కారణం అంటూ పలు చోట్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ నేతలను నిలదీస్తున్నారు.
తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఫించన్లు నిలిపివేతపై ఓ వ్యక్తి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలను నిలదీశాడు. పలువురు పార్టీలో చేరుతుండగా సభా వేదిక వద్దకు దూసుకొచ్చిన ఆ వ్యక్తి, తన ఫించన్ ఎందుకు నిలిపేశారంటూ ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న నాయకులు, ఏం సమాధానం చెప్పాలో తెలియక చంద్రబాబే ఫించన్ ఆపించారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్న ఆ వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లారు.