ఎమ్మెల్యేలు లేకుండానే కార్యక్రమాలు - వైఎస్సార్సీపీ కొత్త ఇంఛార్జ్‌లే సర్వం - MLA Sudhakar
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 7:52 PM IST
Class War in YSRCP in Kodumuru Constituency: వైఎస్సార్సీపీలో నియోజకవర్గ నూతన ఇంఛార్జ్‌లను నియమించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయింది. కర్నూలు జిల్లా కోడుమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ ఉండగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున డాక్టర్. ఆదిమూలపు సతీష్‌ను ఇంఛార్జ్‌గా అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎమ్మెల్యేను ఆహ్వానించకుండానే అధికార కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలకు నూతనంగా నియమించిన ఇంఛార్జ్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
కర్నూలులోని వెంకయ పల్లె ఎల్లమ్మ దేవాలయం (దేవాదాయశాఖ) నూతన ఛైర్మన్‌గా ఎ.మహేశ్వర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా వెంకాపల్లె ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కమిటీ సభ్యులతో దేవాదాయశాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్.సుధాకర్ లేకుండానే నిర్వహించారు.
కోడుమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ ఆదిమూలపు సతీష్‌తో పాటు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్య నేత కోట్ల హర్షవర్థన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో నిజమైన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు న్యాయం జరగలేదని పరోక్షంగా ఎమ్మెల్యేను విమర్శించారు.