అర్చకుల మధ్య ఘర్షణ - అసభ్య పదజాలంతో దూషించుకుంటూ దాడులు - Penuganchiprolu Tirupatamma Temple
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 4:04 PM IST
Clash Between Priests in Tirupatamma Temple: ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం (Penuganchiprolu Tirupatamma Temple)లో అర్చకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంగళవారంతో అమ్మవారి పెద్ద తిరునాళ్లు (Thirupatamma Ammavari Pedda Thirunallu) ముగిసిన సందర్భంగా ఈ రోజు ఉదయం ఆలయంలో పూర్ణాహుతి జరిగింది. అనంతరం మండల దీక్షలు ముగించుకున్న దీక్ష స్వాములు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో పలువురు దీక్ష స్వాములు కానుకల రూపంలో అక్కడే ఉన్న కొందరి అర్చకులకు నగదు ఇచ్చారు.
పెద్ద మొత్తంలో భక్తుల నుంచి అర్చకులు డబ్బులు వసూలు చేశారు. ఈ నగదును పంచుకునే క్రమంలో వారి మధ్య వివాదం రేగింది. అర్చకుల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఆలయంలో భక్తుల సమక్షంలో అర్చకులు ఒకరిపై మరొకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు చొరవ తీసుకుని వారిని విడిపించారు. ఆలయంలో అర్చకులు కొట్టుకోవటం ఏంటని చీవాట్లు పెట్టారు. జరిగిన ఘటనతో ఆలయ అధికారులు అక్కడికి చేరుకుని అర్చకులను సముదాయించారు. అనంతరం ఘటనపై ఆలయ ఇన్స్పెక్టర్ (Temple Inspector) ఏఈవో (AEO)కు ఫిర్యాదు చేశారు.