ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి - సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 4:59 PM IST
Citizens For Democracy Meeting in Srikakulam: శ్రీకాకుళంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో చేపట్టిన 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. బాపూజీ కళామందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగం ప్రజా సాంస్కృతిక కళాజాతలో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు యువ ఓటర్లను ఆకట్టుకున్నాయి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రధాన వక్తగా యువతకు దిశానిర్ధేశం చేశారు. ప్రస్తుతం ఈ ప్రజాస్వామ్యంలో క్రిమినల్ కేసులు ఉన్నవారు సైతం ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి నెలకొందన్నారు. పట్టణాల్లో ఓటు శాతం తగ్గుతుందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఓటర్లు ఎంతో చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' అనే నినాదంతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమాలను మార్చి 8న కర్నూలులో ముగిస్తామని వల్లంరెడ్డి తెలిపారు. మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలమని లక్ష్మణరెడ్డి అన్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు వల్లంరెడ్డి సూచించారు. రాష్ట్రస్థాయి కళాబృందం నృత్య నాటికలు, గేయాలు, జానపదాలతో ఓటర్లను జాగృతపరుస్తుందని లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.