ప్రాణం తీసిన ఈత సరదా- ఊపిరాడక ఇద్దరు విద్యార్థులు మృతి - Children drowned in the pond - CHILDREN DROWNED IN THE POND
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 1:42 PM IST
Children Drowned In Pond at Krishnapuram: ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో చోటు చేసుకుంది. పచ్చనపల్లెకు చెందిన ఇద్దరు విద్యార్థులు సంజయ్, ఆకాశ్ ఈత కొట్టడానికి సమీపంలోని కృష్ణాపురం చెరువులోకి దిగి మృతి చెందారు.
స్థానికుల సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లా పచ్చనపల్లె దళితవాడకు చెందిన సంజయ్, ఆకాశ్ మంగళవారం ఆవుల్ని తోలుకుని చెరువు సమీప పొలాలకు వెళ్లారు. అనంతరం ఇద్దరూ సరదాగా చెరువులో స్నానానికి దిగి అడుకుంటూ లోతైన ప్రదేశం మధ్యలోకి వెళ్లిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో మునిగిపోతున్నామని గ్రహించిన చిన్నారులు కాపాడాలంటూ కేకలు వేశారు. దీన్ని గమనించిన స్థానికులు, రైతులు వచ్చేలోగా ఇద్దరూ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆకాష్ పదో తరగతి పూర్తిచేశాడు. సంజయ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా హాయిగా నవ్వుతూ ఆడుకుంటున్న పిల్లలు అంతలోనే తరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.