నెల్లూరు Vs తిరుపతి 'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో చీటింగ్ - న్యాయం చేయాలంటున్న బాలికలు - ఆడుదాం ఆంధ్రాలో మోసం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 1:42 PM IST
Cheating in Adudam Andhra: విశాఖలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 'ఆడుదాం ఆంధ్రా' తుది పోటీల్లో నిబంధనలు పాటించలేదంటూ క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. నిబంధనల ప్రకారం తుది జట్టులోని ఆటగాళ్లు ఒకే సచివాలయం పరిధిలోని వారై ఉండాలి. కానీ, ఇతర ప్రాంతాలకు చెందిన వారితో ఆడించారంటూ ప్రత్యర్థి జట్టు సభ్యులు ఆరోపించారు. శుక్రవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మార్ పల్లి-2, నెల్లూరు జిల్లా కసుమూరు బాలికల జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
ఎమ్మార్‌పల్లి జట్టులో ఆ సచివాలయ పరిధిలోని క్రీడాకారిణులు ముగ్గురే కాగా, మిగిలిన వారంతా పశ్చిమ గోదావరి, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రాష్ట్ర స్థాయి ఆటగాళ్లు ఉన్నారని కసుమూరు జట్టు బాలికలు ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభించాల్సి ఉండగా, సాయంత్రం 5.30కు ఆడించారని వాపోయారు. ఆడకపోతే అనర్హులమవుతామన్న కారణంగా చీకట్లోనే నాలుగు ఓవర్ల తరువాత మమ అనిపించారని తెలిపారు. దీనిపై కసుమూరు జట్టు కోచ్ మల్లికార్జునరెడ్డి, బాలికలు శాప్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని బాలికలు కోరారు.