అసలు సినిమా మొదలైంది - కాస్కో జగన్ రెడ్డి: చంద్రబాబు - రాజధాని ఫైల్స్‌పై హైకోర్టు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 7:29 PM IST
Chandrababu on Rajadhani Files: జగన్ రెడ్డికి అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుందని, కాస్కో జగన్ రెడ్డి అని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఇప్పటి వరకూ జగన్ నడిపించిన సినిమా అయిపోయిందని ఆయన ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థానంలోని వ్యక్తి, ఒక ప్రాంతంపై కక్షగట్టి సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. అది రాష్ట్ర రాజధానిపై కావడం చారిత్రాత్మక విషాదమని చంద్రబాబు మండిపడ్డారు. దీనికోసం జగన్ కులాల కుంపట్లు రాజేశాడని, విష ప్రచారాలు చేయించాడని దుయ్యబట్టారు.
అధికార బలాన్ని పూర్తిగా ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. ఈ కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన చిత్రం 'రాజధాని ఫైల్స్' అని ప్రకటించారు. జగన్ క్రూరత్వానికి, వైఎస్సార్సీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని అని, దాని కోసం త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం చూపించిందని అన్నారు. అందుకే ఈ చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించాడని విమర్శించారు. కానీ, కోర్టు ఆ ఆటలను సాగనివ్వలేదన్నారు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూసి వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.