ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబు పాత్ర - Chandrababu Naidu became key Role - CHANDRABABU NAIDU BECAME KEY ROLE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 7:49 PM IST
|Updated : Jun 6, 2024, 3:35 PM IST
Chandrababu Naidu became key Role in NDA: సార్వత్రికల ఫలితాల అనంతరం అటూ ఏపీతో పాటుగా ఇటు కేంద్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితం కావడంతో... మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఎన్డీఏలో బీజేపీ అనంతరం అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలతో బీజేపీ దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మోదీ, చంద్రబాబును తన పక్కనే కూర్చున్నారు. మోదీ, చంద్రబాబుతో కీలక మంతనాలు జరిపారు. మోదీకి ఒకవైపు, జేపీ నడ్డా మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. కూటమిలో కీలకంగా మారిన చంద్రబాబుకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్డీయే పక్షాలు : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తెదేపా అధినేత చంద్రబాబు, నీతీశ్ కుమార్ (జేడీయూ), ఏక్‌నాథ్ శిందే (శివసేన), హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్), చిరాగ్ పాసవాన్ (ఎల్‌జేపీ-ఆర్‌వీ), జితన్‌రామ్ మాంఝీ (హెచ్‌ఏఎం), పవన్ కల్యాణ్ (జనసేన), సునీల్ తట్కరె (ఎన్సీపీ), అనుప్రియ పటేల్ - ఏడీ(ఎస్), జయంత్ చౌదురి (ఆర్‌ఎల్డీ), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), ప్రమోద్ బోరో (యూపీపీఎల్), అతుల్ బోరా (ఏజీపీ), ఇంద్ర హంగ్ సుబ్బ (ఎస్‌కేఎం), సుదేష్ మహతో ( ఏజేఎస్‌యూ) తదితరులు సమావేశానికి హాజరయ్యారు.