పలుగు, పారతో రోడ్డు నిర్మాణం - గిరిజనుల బాధను పట్టించుకోని అధికారులు - Alluri District Tribals Built Road - ALLURI DISTRICT TRIBALS BUILT ROAD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 3:13 PM IST
Buriga Tribals Start Built The Road in Alluri District: అల్లూరి జిల్లా గిరిజనుల చిరకాల కోరిక ఒక రోడ్డు. రహదారి నిర్మించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని బూరిగ, చిన్నకోనేల గిరిజనులు ఏకమై స్వయంగా రహదారి నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వాల వైపు చూడకుండా చేయి చేయి కలిపి పలుగు, పార పట్టి బూరిగ నుంచి విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామం వరకు 8 కిలోమీటర్లు మేర రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అత్యవసర సమయాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులకు పట్టలేదని వాపోతూ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు.
పెద్ద పెద్ద బండలను సైతం తొలగించారు. 30 రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని ఆదివాసిలు అంటున్నారు. బూరిక, చిన్నకోనేల గ్రామాల్లో 74 కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లు రొంపెల్లి పంచాయతీకి రేషన్‌కు వెళ్లాలన్న, ఆసుపత్రికి పోవాలన్నా 12 కిలోమీటర్లు కాలినడకపై వెళ్లవలసి వస్తుంది. ఇటీవల నిండు గర్భీణలను సైతం గిరిజనులు డోలు మోసుకొని వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. కరెంట్ సౌకర్యం లేకపోయినా ఆదివాసులు జీవనం కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు రోడ్డు వేయాలని చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కొత్త ప్రభుత్వమైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.