తెలుగు జాతి ఉన్నంత కాలం రామోజీరావు గుర్తుంటారు : కేటీఆర్ - KTR Harish rao On Ramoji Rao Demise - KTR HARISH RAO ON RAMOJI RAO DEMISE
Published : Jun 8, 2024, 2:09 PM IST
KTR Harish rao On Ramoji Rao Demise : తెలుగు పత్రికారంగంలో, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా ఆయన చిరకాలం నిలిచిపోతారని తెలిపారు. రాష్ట్రం బాగుండాలని ఆయన కోరుకునే వారని గుర్తుచేసుకున్నారు. ఆయన 'మొబైల్ ఎన్సైక్లోపీడియో' లాంటివారని కేటీఆర్ అభివర్ణంచారు. రామోజీరావు చాలా దార్శనికులని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలుగు భాష ఉన్నంతకాలం ప్రజలు ఆయనని గుర్తుపెట్టుకుంటారని అభిప్రాయపడ్డారు.
తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను : రామోజీరావు మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన మృతి యావత్ తెలుగు ప్రపంచానికి, మొత్తం దేశానికి లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరానికి కూడా సామాజిక బాధ్యత ఉందని చాటిచెట్టి నిరూపించిన వ్యక్తి రామోజీరావు అని హరీశ్‌రావు కొనియాడారు. మీడియారంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి అని ఆయనని కీర్తించారు. దేశంలోనే గొప్ప ఫిల్మ్‌సిటీని నిర్మించి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఆయన చాలా కృషి చేశారన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.