జాతీయరహదారి వెంట పక్షుల సందడి- సెల్ఫీలతో గడుపుతున్న జనం - Birds Buzzing
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 5:24 PM IST
Birds Buzzing in Trees at Ayyapareddypalem National Highway: సంధ్యా సమయం అయిందంటే చాలు అక్కడ పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతం మార్మోగిపోతుంది. వాటి రాకతో ఆ ప్రాంతం మొత్తం ఒక్క సారిగా పర్యటకులతో సందడిగా మారుతుంది. ఇది ఎక్కడో కాదు మన తిరుపతి జిల్లాలోనే. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని నాయుడుపేట మండలం అయ్యపరెడ్డిపాళెం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువులోని చెట్లపై పక్షులు సందడి చేస్తున్నాయి. పక్షుల సంతతి కేంద్రం నేలపట్టును తలపించేలా ఇక్కడ కొంగలు, నల్ల ముక్కు కొంగలు, ఇతర పక్షులు భారీగా చేరుకుంటున్నాయి.
సాయంత్రం వేళల్లో కొన్ని వేల పక్షులు కిలకిల రావాలతో కనువిందు చేస్తున్నాయి. ఇలా అన్ని పక్షులు ఒకే చోటుకి చేరుకోవడంతో ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారింది. ఆ పక్షులు పగలంతా ఆహారం కోసం బయటకు వెళ్లి సాయంత్రం తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. 16వ నెంబరు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాల చోదకులు, ప్రజలు ఆగి పక్షులను చూసి సెల్పీలు దిగిన తర్వాత ముందుకు సాగుతున్నారు.